Saturday 29 July 2017

Pawan Stands for Uddanam


ఉద్దానం బాదితులకు అండగా పవన్ కళ్యాణ్....
ఉద్దానం కిడ్నీ వ్యాధుల విషయంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు వల్లే ప్రాథమికస్థాయి రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వసాయంతో చర్యలు చేపడతామని అమెరికాకు చెందిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు డాక్టర్‌ జోషఫ్‌ బోన్‌వెర్థీ, డాక్టర్‌ వెంకట్‌ సబ్బిశెట్టిలు పేర్కొన్నారు. కవిటి మండలంలోని బొరివంకలో కిడ్నీ రోగులతో నిర్వహించిన ప్రత్యెక కార్యక్రమంలో వైద్యనిపుణులు మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలు, ఇతర అంశాలు పరిశీలించిన తరువాత ఉద్దానంలో సమగ్ర పరిశీలన నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్థానికంగా పరిశోధనకేంద్రం ఏర్పాటుకు అవసరమైన వసతులు, వనరులు, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. డాక్టర్‌ జోషఫ్‌ మాట్లాడుతూ ఇక్కడ వ్యాధి తీవ్రతకు ప్రకృతి, జన్యు సంబంధం, వ్యవసాయంలో వినియోగించే రసాయన ఎరువులు, నివాసిత ప్రాంతాలు, వృత్తిపరమైన అంశాలు, మంచినీటి పరిస్థితులు, రవాణా అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే మూలాలు కనుక్కోవడం జరుగుతుందన్నారు. పవన్‌కళ్యాణ్‌ సహకారంతో కిడ్నీ వ్యాధిని పారదోలేందుకు చర్యలు చేపడతామన్నారు.



రోగులతో మాట్లాడిన నిపుణులు..
బొరివంక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వైద్య నిపుణులు పలువురు రోగులతో మాట్లాడుతూ విభిన్న అంశాలను తెలుసుకున్నారు. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాలకు చెందిన 150 మంది వరకు రోగులు సమావేశస్థలం వద్దకు చేరుకొన్నారు. హార్వర్డు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు జోషఫ్‌, వెంకట్‌సబ్బిశెట్టి మాట్లాడుతూ పలు అంశాలపై ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన పులక జేజమ్మతో మాట్లాడుతూ ఆకలి, నొప్పి, మందుల వినియోగం, ఆర్ధిక పరిస్థితులు, శారీరక ఇబ్బందులు, కుటుంబసభ్యుల్లో ఇంకెవరికైనా వ్యాధి సోకిన అంశాల గురించి ప్రశ్నించారు. సోంపేట సామాజిక ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ ప్రధాన శివాజీ తయారుచేసిన ప్రత్యేక నివేదికను ప్రొఫెసర్‌ జోషఫ్‌కు అందజేసిన తర్వాత బొరివంక గ్రామంలో కొన్ని వీధుల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను అంచనా వేశారు.



1.30 లక్షల మంది కిడ్నీవ్యాధి బారిన...
డాక్టర్‌ హరిప్రసాద్‌ గారు మాట్లాడుతూ ఉద్దానం ఏడు మండలాలలో 4.5 లక్షల మంది నివసిస్తుండగా అందులో 1.30 లక్షల మంది కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు తమ అధ్యయనంలో గుర్తించామని తెలిపారు. ఇంతటి తీవ్రత ఉన్నందునే పవన్‌కళ్యాణ్‌ హార్వర్డ్‌విశ్వవిద్యాలయ నిపుణులతో మాట్లాడి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారని వివరించారు. పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన వసతులు, ఇతర అంశాలు పరిశీలించేందుకు హార్వర్డు ప్రొఫెసర్లు వచ్చారని, ప్రాథమిక దశలో కొందరి రోగులతో మాట్లాడడం ద్వారా భవిష్యత్తు కార్యాచరణకు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.. నిమ్స్‌ విశ్రాంత వైద్యనిపుణుడు ప్రొఫెసర్‌ దక్షిణమూర్తి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధికి గురైనవారికి వైద్య సేవలు అందించడమే కాకుండా మూలాలు తెలుసుకోవడమే ప్రధానంగా కార్యాచరణను చేపట్టాల్సి ఉందన్నారు. డాక్టర్‌ వై.కృష్ణమూర్తి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ప్రాథమికస్థాయిలో సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. కొత్తగా వ్యాధిబారిన పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాధి సోకినవెంటనే వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో అందజేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

Thank you for Visit.
 

No comments:

Post a Comment